CHAIRMAN'S MESSAGE

Chairman

PATTEM VENKATESWARLU
Advocate
Chairman, AAHA Group.
makejustice1971@gmail.com

ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ మహానగరమున స్థిరపడిన 13 జిల్లాల సోదర సోదరిమనులకు ఆహా (ఆంధ్ర హైదరాబాద్ అసోసియేషన్) అభినందనలు మరియు నమస్కారములు తెలియజేస్తున్నది.

మనమందరం ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో లేదా ఉన్న ఊర్లో ఉపాధి కరవై ఏదైనా వృత్తిలో స్థిరపడి జీవనాన్ని కొనసాగించడానికి ఉన్న ఊరిని, అయిన వారందరినీ వదిలి, హైదరాబాద్ మహానగరానికి వచ్చి అనేక సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాము. మన వృత్తి పరమైన కారణాలు కావచ్చు, వ్యక్తి గతమైన కారణాలు కావచ్చు. ఏది ఏమైనప్పటికి మళ్ళీ మన సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి. భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరంలో పౌరులుగా ఉండటమే అదృష్టం అనే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వారు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇక్కడి స్థానిక ప్రజలు ఇతర ప్రాంతాల నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చిన మనల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. మనం కూడా తలలో నాలుక మాదిరిగా వారితో కలిసిపోయాము. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ కె.చంద్రశేఖర రావుగారు మనలను కంటికి రెప్పలా కాపాడటమే కాకుండా, మనల్ని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నారు.

మనం కూడా ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడడం సరియైనది కాదని తలచి, మనకు మనమే చిన్న చిన్న విషయాలకు సహకరించు కోవాలనే సదుద్దేశ్యంతో, పరస్పరం సహకరించుకుంటూ మన జీవన గమనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక వేదిక ఉండాలనే సంకల్పంతో ఆహా (ఆంధ్ర హైదరాబాద్ అసోసియేషన్) అనే ట్రస్టును పట్టెం వెంకటేశ్వర్లు - చైర్మన్, బెజ్జల రాఘవేంద్రస్వామి - వైస్ చైర్మన్, కాగిత రామకృష్ణ ప్రతాప్ - జనరల్ సెక్రటరీ, ధూళిపాళ నరసింహారావు - జాయింట్ సెక్రటరీ, వెల్లటూరు జితేంద్ర - కోశాధికారి, సప్పా శ్యామ్ ప్రసాద్ - కార్యవర్గ సభ్యులుగా అక్టోబరు 04,2019వ తేదీన స్థాపించడం జరిగింది.

ఈ ట్రస్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం సాధారణ సభ్యుల పిల్లలకు ఉచితంగా విద్యను అందించటం, అవసరమైన సభ్యులకు ఉపాధి కల్పనలో తోడ్పాటును అందించటం మరియు ఎప్పుడైన విపత్కర పరిస్థితులు, ఉహించని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్ధిక సహకారాన్ని అందించటం వంటి కార్యక్రమాలను నిర్వహించడం.

అంతేకాకుండా భవిష్యత్తులో ఆహా విద్యాసంస్థలను స్థాపించి, వాటిద్వారా సభ్యుల పిల్లలకు ఉచిత విద్యను అందించడమే కాకుండా,వారికి మెరుగైన పౌష్టికాహారంతో పాటు, ఇతర సదుపాయాలను మరియు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను, క్రమశిక్షణను నేర్పించడం జరుగుతుంది. కుటీర పరిశ్రమలను స్థాపించి అవసరమైన వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. సభ్యులకు ఎవరికైనా ఆర్ధిక సహాయం అవసరమైన ఎడల సముచితం, సహేతుక కారణం ఉందని ఆహా భావిస్తే ఆర్ధిక సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా మరెన్నో మంచి కార్యక్రమాలకు ముందు ముందు శ్రీకారం చుట్టబోతున్నాము.

ఆహ ట్రస్టు నందు జీవితకాలం సాధారణ సభ్యత్వం పొందుటకు సభ్యత్వ రుసుము ప్రతి సభ్యునికి రూ. 100/-లు గా నిర్ణయించడం జరిగింది. ఆన్‌లైన్‌ ద్వారా సభ్యత్వం పొందగోరు వారు ఇతర చార్జీల రూపంలో అదనంగా రూ.8/- చెల్లించవలసి ఉంటుంది. సభ్యులుగా చేరడం ద్వారా వచ్చిన వంద రూపాయలు ఖర్చు చేయుటకు ట్రస్టుకు ఎలాంటి అధికారము లేదు. మీరు సభ్యత్వ రుసుముగా ఇచ్ఛే వంద రూపాయలపై వచ్చే వడ్డీతో అనేక ఉపయోగాలు ఉండే విధంగా రూపకల్పన చేయటం జరిగింది.

మన ట్రస్టుకు ప్రధాన ఉద్దేశ్యంగా Live, Let Live (బ్రతుకు, బ్రతికించు) అనే నినాదం ఏర్పాటు చేసుకున్నాము. లేనివారికి చేయూతను అందించడమే ఆహా ట్రస్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావు లేదు. ఎవరిపైనా వ్యతిరేక భావంతో ఏర్పడినటువంటిది కాదు మరియు ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. కనుక ప్రతి ఒక్కరూ ఆహాలో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా, మీకు తెలిసిన వారిని కూడా ఆహాలో సభ్యులుగా చేర్పించాలని సగౌరవంగా కోరుతున్నాము. తద్వారా ఏ విధమైన ఇబ్బందులు సభ్యులకు ఎదురైనా ఆహా సంస్థ నుండి సహకారం అందిచగలమని తెలియజేస్తున్నాము.

ధన్యవాదములు
ఈ ఆహా మనది, మనందరిది... రండి! మనకోసం మనమందరం కలిసి పని చేద్దాం
పరస్పరం సహకరించుకుందాం! కలిసికట్టుగా పురోగమిద్దాం!!